ఈటల భూ వ్యవహారాలపై ఉన్నతస్ధాయి విచారణను స్వాగతిస్తున్నాం- సిపిఐ(ఎం)

ఈటల భూ వ్యవహారాలపై ఉన్నతస్ధాయి విచారణను స్వాగతిస్తున్నాం
అసైన్డ్‌ భూముల అన్ని వివాదాలపై హైలెవల్‌ కమిటీ విచారణకు ఆదేశించాలి
– సిపిఐ(ఎం)
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములను ఆక్రమించారన్న ఫిర్యాదుపై  ముఖ్యమంత్రే స్వయంగా ఉన్నతస్ధాయి విచారణకు ఆదేశించడం సరైన చర్యగా సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ భావిస్తున్నది. అయితే వస్తున్న వార్తలను బట్టి ఈ చర్య భూములను అక్రమ ఆక్రమణల నుండి వెలికితీయటానికా లేక పార్టీలోని అంతర్గత కుమ్ములాటల్లో భాగమా అనే సందేహం కలుగుతోంది. ఈ సందేహం తీర్చి, తన కార్యాచరణతో ప్రజల ముందుకు రావాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉంటుంది. నిజంగా అక్రమ భూములన్నింటిపైనా చర్యలు తీసుకొనే సదుద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లయితే ఇప్పటికే లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూములపై సిపిఐ(ఎం), అనేక ప్రజాసంఘాలు వేలకొద్దీ ఫిర్యాదులను ప్రభుత్వానికి ఇచ్చివున్నాం. వాటన్నింటిపై హైలెవల్‌ కమిటీతో విచారణ చేస్తే అన్యాక్రాంతమైన లక్షల ఎకరాల భూములు వెలుగులోకి వస్తాయి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు దళిత, గిరిజనులకు మూడెకరాల భూపంపిణీకి భూములు లభ్యమవుతాయని సిపిఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.
అసైన్డ్‌ భూములపై వచ్చిన అన్ని వివాదాలపై విచారణ చేయకుండా ఈటల రాజేందర్‌ పైనే విచారణకు పరిమితమైతే టిఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వ అంతర్గత సమస్యలను అసైన్డ్‌ భూముల వ్యవహారంగా చిత్రీకరిస్తున్నారని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతుంది. అసైన్డ్‌ భూముల వ్యవహారం ముఖ్యమంత్రి, మంత్రుల స్వంత వ్యవహారం కాదు. లక్షల మంది పేద ప్రజలు కోట్లాది విలువైన అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశంగా ముఖ్యమంత్రి గుర్తించి తక్షణమే హైపవర్‌ కమిటీ విచారణకు ఆదేశించాలని సిపిఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల ఎకరాల భూములు దళిత, గిరిజన, ఇతర పేదలకు పంచినట్లుగా ప్రభుత్వ లెక్కల్లో వున్నాయి. 1977 అసైన్డ్‌ చట్టం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు అమ్మడానికి, కొనుగోలు చేయడానికి వీలులేదు. కానీ అత్యధికశాతం భూములు లబ్దిదారుల అనుభవంలో లేవు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా అసైన్డ్‌ భూములపై ఉన్నతస్ధాయి విచారణ చేసి అన్యాక్రాంతమైన భూములను తిరిగి పేదలకు స్వాధీనం చేయాలని సిపిఐ(ఎం) అనేక పోరాటాలు నిర్వహించి, ప్రభుత్వానికి విన్నపాలు చేసింది. రాజకీయ నాయకులు మొదలు అధికారులు, ధనవంతులు లక్షల కోట్ల విలువైన పేదల అసైన్డ్‌ భూములను అన్యాక్రాంతం చేసుకొని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అసైన్డ్‌ భూములను ఆక్రమించుకున్న వాళ్లను కాపాడటానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్‌ అక్రమ ఆక్రమణలకు గురైన అసైన్డ్‌భూములపై హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసి అక్రమ ఆక్రమణలన్నింటినీ వెలికితీయాలని సిపిఐ(ఎం) రాష్ట్రకమిటీ ప్రభుత్వాన్ని కోరుతోంది.

(తమ్మినేని వీరభద్రం)
రాష్ట్ర కార్యదర్శి

Previous Post
Extension of the ban on international flights. DGCA issued orders
Next Post
ఈటల రాజేందర్ ప్రెస్ మీట్. అంతిమ విజయం ధర్మానిదే!
Extension of the ban on international flights. DGCA issued orders
ఈటల రాజేందర్ ప్రెస్ మీట్. అంతిమ విజయం ధర్మానిదే!

Recent Posts

Menu