కరోనా భీభత్సం!! రక్షణ వ్యవస్థ లేక జనజీవితాలు అల్లకల్లోలం

కరోనా భీభత్సం

Pic Credit: ANI Photo

అత్యంత బాధాకరమైన సంఘటన ఒకటి బీహార్ లో ఇవాళ వెలుగుచూసింది. పవిత్రమైన గంగానదిలో దాదాపు 40 మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఈ మృతదేహాలు కరోనా బాధితులవేమోననే భయం, ఆందోళన పరిసరాలను ముంచెత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ మరణం సమాచారం వచ్చినా, అది కరోనా ప్రభావమే అనే భయం సర్వత్రా కనిపిస్తోంది. దాదాపు ఏడాది క్రితం దేశంలో, ఈ ప్రపంచం మొత్తాన్ని ముంచి మారణహోమం సృష్టిస్తున్న కరోనా బెడద ఇప్పుడు కొద్ది నెలలుగా మన దేశంలో మరింత భయానక వాతావరణానికి దారితీసింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి ? అంటే వైరస్ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో సూచనలు చేసింది. చేస్తోంది. ముఖ్యంగా మాస్కు, భౌతిక దూరం, గుంపుగా ఒక చోట చేరరాదన్నవి వాటిలో ముఖ్యమైనవి. కాగా, వాటిని ఆచరించడంలో ప్రజల నిర్లక్ష్యం ఈ పరిస్థితికి కారణం అని చెప్పాలి. అయితే బాధితులకు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం అనేది చాలా చాలా పెద్ద సమస్యగా తయారైంది. అందుకు కారణం మన దేశంలో సామాజిక భద్రతనిచ్చే ప్రభుత్వ పథకాలు అంతగా విస్తరించకపోవడమే అని చెప్పకతప్పదు. ఫలితంగా వేలు, లక్షల రుపాయలను ప్రైవేటు ఆసుపత్రులకు ముట్టజెప్పినా సరే ప్రాణాలకు ఎలాంటి భరోసా ఉండడం లేదు.

రూ. లక్ష కోట్లతో భరోసా కోసం పథకం

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులకు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుంది. ముఖ్యంగా ఎలాంటి వైద్య బీమా సదుపాయం లేని లక్షలాది మందికి తోడ్పడడం దీని ఉద్దేశం. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం మీడియా కొన్ని వివరాలు బయటపెట్టింది. కరోనా మూడో దశ తాకిడి కూడా రేపోమాపో అంటున్న ప్రస్తుత కాలంలో ప్రభుత్వం లేదా పాలకులు ఇలాంటి ఏ సాయం లేని బీమా రహిత కుటుంబాలకు వెన్ను దన్నుగా నిలవడం అత్యవసరం.

రానున్న రోజులలో రోజువారీ మరణాల సంఖ్య రెట్టింపు కావడం ఖాయం అని ప్రస్తుత అంచనాలు హెచ్చరిస్తున్నాయి. అన్ని రంగాలలోనూ అని సామాజిక, ఆర్థిక రంగాలలోనూ మరణించిన అనేక మందికి సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించవలసిన దుస్థితి అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తోంది. ఆత్మీయులైన వారి ప్రాణాలు పోవడంతో పాటు వైరి వైద్యం కోసం వేలాది రుపాయలను సమకూర్చుకోవడం అన్నిటికన్నా అత్యంత భయంకరంగా మారిపోయింది. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపైనే జీవించే కుటుంబాలకు ఇది దాదాపు అసాధ్యంగా తయారైంది. వ్యాక్సీన్ కోసం యువత బారులు తీరుతున్నారు. అవి ఎంత వరకు రక్షణ ఇస్తాయో ఇంకా స్పష్టంకాలేదన్న వాస్తవం అలాగే ఉంది. మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు అత్యంత విశ్వసనీయమైన అందుబాటు ధరల్లో వైద్యం అందడంలేదు.

సాధారణ సందర్భాలలో కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులను దాచిపెట్టుకున్న కొద్దిపాటి సొమ్ము ఉపయోగించుకోడం సర్వసాధారణం. మరీ తప్పనిసరి అయితే స్నేహితులనుంచి లేదా బంధువుల నుంచి రుణాల రూపంలో ప్రయత్నించడం మామూలే. ఒక్క ముక్కలో చెప్పాలంటే జేబులోని డబ్బు తీసి వైద్యానికి ఉపయోగించుకునే విషయంలో మన దేశం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది. మన దేశంలోని జనాభాలో దాదాపు 60 శాతం మంది వైద్యం కోసం ఖర్చులను తమ సొంత మార్గాలలోనే భరిస్తున్నారు. వీరికి ఏ రకమైన వైద్య సహాయక బీమా సదుపాయాలు లేవు. ఈ పరిస్థితి వల్ల స్వయం ఉపాధిలో జీవిస్తున్న వారు, వ్యవసాయ కూలీలు, లేదా రోజుకూలీలుగా జీవితా సాగిస్తున్న కుటుంబాలు పెరిగిపోతున్న వైద్య భారం భరించలేక సతమతమవుతున్నారు.

రెండేళ్ల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో వైద్య బీమా కోసం ప్రకటించిన సార్వత్రిక వైద్య బీమా పథకం అందరికీ అందుబాటులో చేరడంలో పూర్తిగా విఫలమైంది. కనీసం 10 కోట్ల మందికి అంటే దేశ జనాభాలో అత్యంత పేద కుటుంబాలకు, ప్రయోజనం కలిగించేందుకు దీనిని రూపొందించారు. నిజానికి కొన్నేండ్ల క్రితం నాటి పథకంతో పోలిస్తే మెరుగైనదే. ఈ పథకం ప్రకారం రూ. 5 లక్షల వరకు వైద్య బీమా లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోను, పట్టణాల్లోనూ ఉన్న పేదలందరికీ దీనిని వర్తింపజేశారు.

డ్యూక్ వర్శిటీ అధ్యయనం

ఈ పథకం గురించి డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఇది ఆశించిన స్థాయిలో జనాలకు చేరలేదు. ఈ పథకం కింద ఔట్ పేషంట్లుగా చికిత్స తీసుకునే వారికి వర్తింపజేయలేదు. వాస్తవానికి ఈ రకమైన వైద్యానికే దాదాపు ఎక్కువ భాగం సొంత ఆదాయంలో భరించాల్సి ఉంటుంది. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులకే ప్రధాన పాత్ర ఉంటుంది. ఫలితంగా వైద్య ఖర్చులు ఎప్పుడూ తడిసిమోపెడుగా ఉంటాయి. దీనిని అమలు చేసినా ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవు.

మరో ప్రయత్నం

తాజా ప్రతిపాదనల ప్రకారం రూ. లక్ష కోట్లతో కరోనా భీభత్సం వేళ చేపట్టనున్న పథకం మరి ఎంతవరకూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోగలదో ఊహించుకోవాల్సిందే. కరోనా మూడో వెల్లువ నుంచి ప్రజలకు కొంత ఊరట ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం కావచ్చు. ఏది ఏమైనా ముందుగా ప్రజలకు అందే వైద్య సేవల ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం అన్నింటికన్నా అత్యవసరం.

తైవాన్ దేశమే ఆదర్శం

ఈ విషయంలో తైవాన్ సాధించిన విజయం మనకు మార్గదర్శకం అవుతుంది. కాకపోతే మన దేశ జనాభా 140 కోట్లు కాగా, తైవాన్ జనాభా గట్టిగా 2 కోట్ల 30 లక్షలు మాత్రమే. అయినా కరోనా బెడదను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. కారణం అక్కడి పటిష్టమైన వైద్య సదుపాయాలే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వర్తించే సమగ్రమైన ఆరోగ్య బీమా అమలులో ఉంది. ఎప్పుడైనా రోగి కుటుంబం కొంత భరించవలసి వచ్చినా అది చాలా చాలా సహేతుకంగా పరిమితంగానే ఉంటుంది. వైద్యుని సంప్రదించేందుకు చాలా కొద్ది మొత్తం వెచ్చించాలి. ఆస్పత్రి చేరిక వ్యయం కూడా తక్కువే. ఈ మార్పు అంతా 1995 తరువాతనే సాధ్యమైంది. అంతకుముందు ప్రతి పది మందిలో నలుగురికి ఎలాంటి బీమా సౌకర్యం ఉండేది కాదు.  ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి సేకరించి ఎలక్ట్రానిక్ కార్డుల రూపంలో డేటా భద్రపరిచారు. ఈ మొత్తం సేవలకు జీడీపీ లో 6 శాతం నిధులు వెచ్చించారు. నిజానికి చాలా సంపన్న దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువే. (మన దేశంలో ఇది కేవలం 1.2 శాతం)

9 కోట్ల మంది 140 కోట్ల మంది భారం మోయగలరా?

ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న దేశజనాభా అవసరాలను కేవలం 9 కోట్ల మంది ఉన్న పన్ను చెల్లింపుదారులు తీర్చగలరా? దీనికి ఒక పరిష్కారం ఉంది. దేశంలోని ప్రజలకు అవసరమైన మందులను వైద్య పరికరాలను, తదితరాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. తక్కువ ధరలకే అందరికీ అందజేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ప్రైవేటు ఆసుపత్రులు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి.

Also Read: బ్రిటిష్ నావికా దళ యోధులకు జెట్ స్యూట్

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)
9490617400
9490617431
For Free cab Services (Rachakonda)
9490617234

Check Telangana COVID-19 Updates: https://covid19.telangana.gov.in

Previous Post
New restrictions by Telangana police. Border Restrictions on ambulances of Andhra Pradesh
Next Post
Cyber Attack in America, Major energy pipeline shutdown
New restrictions by Telangana police. Border Restrictions on ambulances of Andhra Pradesh
Cyber Attack in America, Major energy pipeline shutdown

Recent Posts

Menu