కనీస వేతనాలపై మరో కమిటీ, మూడేళ్ల వ్యవధి ఎందుకు ?

కనీస వేతనాలపై మరో కమిటీ

కనీస వేతనాలపై మరో కమిటీ, మూడేళ్ల వ్యవధి ఎందుకు ?

గతవారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మికుల కనీస వేతనాలపై సలహా సూచనలు ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అంత వరకు బాగుంది. అయితే ఈ కమిటీకి మూడేండ్ల వ్యవధిని ఇవ్వడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి కమిటీలకు మూడు నెలలు లేదా కొద్ది నెలల వ్యవధి మాత్రమే ఇచ్చి సిఫార్సులు తెప్పించుకుంటే ప్రయోజనం ఉంటుంది. అంతేకానీ ఇలా మూడేళ్ల తరువాత ఆ కమిటీ ఇచ్చే సిఫార్సులను మరెప్పటికి పరిశీలిస్తారు? ఎప్పటికి అవి అమలులోకి వస్తాయి? సాధారణ కార్మికులకు వాటి ప్రయోజనం ఏ విధంగా ఉపయోగకరం కాగలదు? దీనిని కేవలం కంటి నీటి తుడుపు చర్యగానే భావించాలి. ఒక రకంగా కనీస వేతనాల సమస్యపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఇప్పుడు సందేహించవలసి వస్తుంది.

నాలుగు రోజుల క్రితం అంటే జూన్ 3వ తేదీన కేంద్రప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు గురించి అధికారిక ప్రకటన జారీచేసింది. దీనికి చైర్ పర్సన్ గా ప్రొఫెసర్ అజిత్ మిశ్రా వ్యవహరిస్తారు. ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సంస్థకు డైరెక్టర్ గా ఉంటున్నారు. కనీస వేతనాలను ఖరారు చేసే అంశంపైనా, జాతీయ స్థాయిలో కనీస వేతనాల కనిష్ట పరిమితిని (నేషనల్ ఫ్లోర్ మినిమమ్ వేజేస్) నిర్దేశించేందుకు అవసరమైన సాంకేతిక అంశాలను సూచిస్తూ తగిన సిఫార్సులను అందించాలని కమిటీ ఉద్దేశాన్ని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి మూడేళ్ల పాటు దీని కాల పరిమితి ఉంటుందన్న అంశమే గందరగోళానికి కారణమవుతున్నది. సాధారమైన ఇలాంటి అంశానికి సిఫార్సులు ఇచ్చేందుకు మూడేళ్ల వ్యవధి ఎందుకో అర్థం కాదు. జాతీయ స్థాయిలో కార్మికులకు సంబంధించిన అన్ని అంశాల గురించి లేదా జాతీయ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు, ముఖ్యంగా అసంఘటిత రంగానికి, సంబంధించిన అంశాలపై అయితే ఇంత సుదీర్ఘ కాలం వ్యవధి అవసరం కావచ్చు. సరే ఆ కమిటీకి అప్పగించిన విధుల సమగ్ర స్వరూపం వెల్లడయ్యే వరకు ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం.

ప్రస్తుతానికి పరిశీలించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దీని అవసరం ఏమిటి? ఇప్పటికే పుట్ట గొడుగుల్లా అసంఖ్యాకంగా ఉన్నకమిటీలకు ఇది మరొకటి అవసరమా? దీని వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు ఏమిటి? చట్టాలన్నీ ఇప్పటికే మార్చడానికి వీలు లేనంత బందోబస్తుగా ఉన్న సమయంలో అసలు సాధించదలచిన లక్ష్యం ఏమిటి?

వేతనాలకు సంబంధించిన మొదటి వేజ్ కోడ్ ముసాయిదాను ప్రభుత్వం 2017 ఆగస్టు 10వ తేదీన ప్రవేశపెట్టింది. సవరించిన కోడ్ ను 2019లో ఆమోదించింది. ఈ సందర్భంలోనే అంటే జనవరి 17, 2018న డాక్టర్ అనూప్ సత్పతి (వివి గిరి నేషనల్ లేబర్ ఇనిస్టిట్యూట్) నాయకత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కనీస వేతనాలపై సమూలంగా అధ్యయనం చేసి చారిత్రిక, న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలించి జాతీయ స్థాయిలోనూ, ప్రాంతాల వారీగానూ వేతన రూపాన్ని సిఫార్సు చేసే బాధ్యతలను ఆ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ ప్రపంచం మొత్తం మీద అమలులో ఉన్న ఉత్తమ విధానాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వాటిలో మన దేశంలో అమలు చేయడానికి అవకాశం ఉన్న వాటిని సూచించాలి. అంతర్జాతీయ లేబర్ సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఢిల్లీ కార్యాలయానికి చెందిన వేతన నిపుణుడు ఇందులో సభ్యుడు. ఈ కమిటీ శాస్త్ర్రీయపరంగా సమగ్రమైన నివేదికను 2019లో ప్రభుత్వానికి అందించింది.

కనీస వేతనాలకు సంబంధించినంత వరకు మన దేశంలో అమలులో ఉన్న కనీస వేతన విధానం పూర్వ రంగాన్ని, ఐఎల్ఓ అనుసరించే కనీస వేతన విధానాన్ని, వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి కొన్ని సూచనలు అందించింది ఈ కమిటీ. మొత్తం మీద ఈ కమిటీ సిఫ్ర్సు ప్రకారం కనీస వేతనం రోజుకు  రూ. 375 ఉండాలన్నది. నెలవారీగా అయితే రూ. 9750 ఇవ్వాలని, పట్టణ  ప్రాంత కార్మికులకు రూ. 1430 మేరకు ఇంటి అద్దె అలవెన్సును కూడా ప్రతిపాదించింది. ఇక దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించి వేర్వేరు పరిమితులను సిఫార్సుచేసింది. ఈ సూచనలకు కార్మిక సంఘాల నుంచి మద్దతు లభించలేదు. కొన్ని అంశాలవారీగా మద్దతు తెలిపాయి. రోజు వేతనం 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన విధంగా రూ. 600  ఉండాలని అవి డిమాండ్ చేసాయి. వారి డిమాండ్ అతిగా కనిపించవచ్చు. కానీ ప్రభుత్వంపై సాధ్యమైనంత ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం కోసమే కనుక ఈ డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా సత్పతి కమిటీ సిఫార్సులపై ఏనాడూ నిర్ణయాత్మక చర్చలు చోటుచేసుకోలేదు. కానీ 2019లోనే రోజువారీ కనీస వేతనాలను రూ.  176 నుంచి కేవలం రూ. 178 కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం చూస్తే కమిటీ నివేదికను ప్రభుత్వం పూర్తిగా నిరాకరించినట్లే అర్థంకాగలదు.

ఇక ఇప్పుడీ కొత్త కమిటీ ప్రకటన ఆ విషయాన్నే స్పష్టంచేస్తున్నది.

మరి కొన్ని అనుమానాలు : సరి కొత్తగా ఏర్పాటు చేసిన ఈ మిశ్రా కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు ముగ్గురు ఉంటారట. అంటే ఒక రకంగా ప్రభుత్వ వైఖరికి మాత్రమే వారి మద్దతు ఉంటుందనేది అనుమానం లేని విషయం. బహుశా ఇంతకుముందు సత్పతి కమిటీ సిఫార్సు చేసిన మొత్తం కన్నా తక్కువ మొత్తాన్నే కొత్త కమిటీ ప్రతిపాదించాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం కావచ్చు. ద్రవ్యోల్బణానికి కొంత ప్రాధాన్యతనివ్వవచ్చు.  ఈ మిశ్రా కమిటీ వల్ల ఏ కొద్దిగా అయినా మంచి ఫలితాలు రావాలంటే దానికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రభుత్వపరమైన అడ్డంకులు ఉండకూడదు. ఈ కమిటీలో ఐఎల్ఓ నిపుణులకు చోటు లేకపోవడం సరికాదనిపిస్తుంది. వారికి అంతర్జాతీయంగా అవగాహన ఉంటుంది.

Know more about corporate companies helping hands in the corona second wave situation.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

 

Previous Post
Digital Payments in Corona situation by People
Next Post
Coal India Limited Jobs, with 7th class eligibility. Details for 1080 posts.!
Digital Payments in Corona situation by People
Coal India Limited Jobs, with 7th class eligibility. Details for 1080 posts.!

Recent Posts

Menu